మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యను చంపేసి, డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

మహబూబాబాద్: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రికని చెప్పి అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి భార్యను చంపేశాడు. ఆ తర్వాత 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన కొండబత్తుల నరేష్ కు చిన్నగూడూరు మండలం బయ్యారానికి చెదిన సరిత (28)కు 12 ఏళ్ల క్రితం పెళ్లయింది. వారికి సిరివెన్నెల (10), మేఘన (6) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

నరేష్ డీసీఎం డ్రైవర్. ఆయనకు సరిత రెండో భార్య. ఇటీవల ఆమెపై నరేష్ అనుమానం పెంచుకున్నాడు. కొద్ది రోజుల క్రితం సరితతో గొడవ పడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. దాంతో తల్లి వచ్చి సరితను తన వెంట బయ్యారం తీసుకుని వెళ్లింది. దాంతో సోమవారం నరేష్ బయ్యారం వెళ్లాడు. భార్యను ఆస్పత్రికి తీసుకుని వెళ్తానని నమ్మించి చిన్న కూతురు మేఘనను వెంట తీసుకుని మహబూబాబాద్ కు వచ్చాడు. 

అక్కడి నుంచి మోటార్ సైకిల్ మీద బయ్యారం మండలం నామాలపాడు అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో సరితను పొడిచాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. ఆమె మరణించిందని ద్రువీకరించుకుని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గార్ల - బయ్యారం సీఐ తిరుపతి, ఎస్ఐ జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకుని నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు