తనకు వివాహాం జరగకపోవడానికి తండ్రి రెండో పెళ్లి చేసుకోవడమే అనే కక్షతో సవతి తల్లిని, ఆమె కుమారుడిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యచేశాడు. తమిళనాడుకు చెందిన సుందర్‌రాజ్‌‌కి 35 ఏళ్ల కిందట మెదక్‌కు చెందిన జగదీశ్వరితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు.

కొంతకాలం తర్వాత సుందర్‌రాజ్ తన భార్య సొంత చెల్లెలు వనీశ్వరినీ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. ఈ క్రమంలో సుందర్‌రాజ్ ‌నగరానికి వలసవచ్చి జియాగూడ సాయిదుర్గానగర్‌లో ఒకే ఇంటిని అద్దెకు తీసుకుని వేర్వేరు వేర్వేరు గదుల్లో తన ఇద్దరు భార్యలతో ఉంటున్నాడు.

రెండో భార్య వనీశ్వరి, అతని కుమారుడు నటరాజ్‌తో కలిసి పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌ ప్రాంతంలో ఉంటున్నాడు.. వీరు నగల దుకాణాల ఎదుట వేస్టేజ్ స్క్రాప్ మట్టి, బూడిద సేకరించి ఖనిజాలను వేరు చేస్తూ వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

మొదటి భార్య కుమారుడు, కూతురికి, రెండో భార్య ఇద్దరు కూతుళ్లకి పెళ్లిళ్లు అయ్యాయి. అయితే సుందర్‌రాజ్ తన పెద్ద భార్యను ఆమె పిల్లల బాగోగులు పట్టించుకోకుండా రెండో భార్య వద్దే ఉంటున్నాడు.

జగదీశ్వరి కుమారుడు మోహన్‌కు పెళ్లి చేసేందుకు సుందర్‌రాజ్ ముందుకు రాకపోవడంతో.. తన పెళ్లికి తండ్రి రెండో పెళ్లి అడ్డుగా మారిందని అతనితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వనీశ్వరి, ఆమె కుమారుడు నటరాజ్ తమ ఇంటి గుమ్మం బయటే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.

కత్తులతో పొడవటంతో పాటు సుత్తి లేదా గడ్డపార వంటి ఆయుధాలతో అత్యంత దారుణంగా వారిని మోది చంపినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయి. మోహనే తన స్నేహితులతో కలిసి సవతి తల్లిని, ఆమె కుమారుడిని చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని స్థానికులు అనుకుంటున్నారు.

అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను నిందితులు అదే ఇంట్లోని బావిలో పడేసి ఉంటారని పోలీసులు అందులో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.