వాళ్లిద్దరూ ఒకప్పుడు క్లాస్ మేట్స్. ఆ తర్వాత వేరు వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కాగా.. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధం కుదరగా.. ఆ సంబంధాన్ని ఈ యువకుడు చెడగొట్టాడు. తన ప్రేమను గెలిపించుకుందామని అతను చేసిన ప్రయత్నం సదరు యువతి కుటుంబసభ్యులకు తెలిసిపోయింది. అంతే.. అదే అతని చావుకొచ్చింది. పెళ్లి చెడగొట్టాడనే కోపంతో యువతి సోదరుడు సదరు యువకుడికి అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ ప్రాంతానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్‌ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్‌లో చదివించారు. 

ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్‌ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్‌ (22) హైదరాబాద్‌లోనే ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కావడంతో ఇద్దరూ కొడవటూర్‌ గ్రామంలోనే ఉంటున్నారు.

ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్‌తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్‌ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్‌ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. ఆ పిల్ల నాది.. నువ్వు పెళ్లి చేసుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు.

 దీంతో పెళ్లి చేసుకోవడానికి వరుడు నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్‌పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్‌ వెళుతున్న అతడిని  యువతి సోదరుడు శివకుమార్‌ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్‌ రోడ్డుపై కమాన్‌ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.