హైదరాబాద్‌: ఓ వ్యక్తి శ్మశానంలో రెండు సమాధుల మధ్య తన ప్రేయసిని చంపేశాడు. మాట్లాడుకుందాం రావాలని చెప్పి అతను తన ప్రేయసిని శ్మశానానికి తీసుకుని వెళ్లాడు. రెండు సమాధుల మధ్య ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ప్రేయసిని చంపిన అతన్ని ఆర్జీఐ ఎయిర్ పోర్టు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 

వల్లెపు శ్రీను (42) చెత్త ఏరుకుని జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇల్లు కూడా లేదు. రంగారెడ్డి జిల్లా వెలజర్ల గ్రామానికి చెందిన అతను శంషాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అతను ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వారిద్దరు విడిపోయి గత 15 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. 

ఆరేళ్ల క్రితం శ్రీనుకు పద్మమ్మ (40) అనే మహిళ పరిచయమైంది. ఆమె కూడా భర్త నుంచి విడిపోయి విడిగా ఉంటోంది. ఈ స్థితిలో పద్మమ్మకు, శ్రీనుకు మధ్య సంబంధం ఏర్పడింది. అయితే, కొద్ది రోజులుగా ఆమెపై అతనికి అనుమానం కలుగుతూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం ఫుట్ పాత్ పై ఆమె పక్కన మరో పురుషుడు పడుకుని ఉండడాన్ని అతను చూశాడు. దీంతో ఆమెను చంపాలని అనుకున్నాడు. 

మంగళవారంనాడు పద్మమ్మను శ్రీను శ్మశానం వద్ద గల పొదల్లోకి తీసుకుని వెళ్లాడు. ఇద్దరు రెండు సమాధుల మధ్య కూర్చుని మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత ఆమె స్పృహ తప్పింది. ఆ సమయంలో అతను బండరాయితో మోది ఆమెను చంపేశాడు. తలను ఛిద్రం చేశాడు. ఆ తర్వాత తన సొంతూరికి పారిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.