తన తల్లిని కాదని మరో మహిళతో తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ కొడుకు కక్ష పెంచుకున్నాడు. ఆ వేరే మహిళ కూడా తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి కావడంతో మరింత పగతో రగిలిపోయాడు. దీంతో తల్లితో కలిసి.. కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రారు మండలం అంబం(ఆర్) గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రుద్రారు మండలం అంబం గ్రామానికి చెందిన గంగారంకి పెళ్లై భార్య సాయవ్వ , పిల్లలు ఉన్నారు. గంగారం పెద్ద కొడుకు గంగాధర్ కి కూడా పెళ్లయ్యింది. కాగా... గంగారం కన్ను.. కొడుకు భార్యపై పడింది. భార్య, కొడుకుకి తెలీకుండా కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గంగాధర్, సాయవ్వలకు తెలిసిపోయింది. దీంతో... మంగళవారం రాత్రి  ఈ విషయంపై తండ్రితో గంగాధర్, సాయవ్వలు గొడవ పడ్డారు.

పద్దతి మార్చుకోవాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను వినిపించుకోకపోవడంతో.. కర్రలతో దాడి చేసి కొట్టి చంపేశారు. దీంతో గంగారం అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమకేమీ తెలీనట్లు నటించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ తండ్రిని చంపేశారటూ నటించారు. అయితే... పోలీసులకు అనుమానం రావడంతో.. తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగు చూసింది. వాళ్లు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.