నాలుగు రోజుల క్రితం నగరంలో దారుణ హత్యకు గురైన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. సొంత తమ్ముడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నగలు ఇవ్వమని అడిగినందుకే తమ్ముడు అక్కని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చందానగర్ కి చెందిన శ్వేతలక్ష్మి, ఆమె సోదరుడు ఆర్. రమణరావు(36)లు పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. శ్వేతలక్ష్మికి 15 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. రెండేళ్ల క్రితం ఆమె భర్త నుంచి విడిపోయింది. తన తండ్రి ఇచ్చిన ఆస్తిని బ్యాంకులో వేసుకొని ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమె సోదరుడు రమణరావు ఆమె ఇంటికి రోజూ వచ్చి వెళ్లేవాడు.

మధ్యాహ్నం, సాయంత్రం వేళలలో ఇద్దరూ కలిసి కూర్చొని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని మద్యం తాగి, బిర్యానీ తినేవారు. దీంతో.. బ్యాంకులో జమచేసిన డబ్బులు అయిపోయాయి. ఈ క్రమంలో శ్వేతలక్ష్మి దగ్గర ఉన్న నగలను తాకట్టుపెట్టి రమణారావు డబ్బులు తెచ్చాడు. వీరి జలసాలకు ఆ డబ్బులు కూడా అయిపోయాయి. 

దీంతో... తాకట్టు పెట్టిన తన డబ్బులు తనకు ఇవ్వాలని ఇటీవల శ్వేత తన సోదరుడు రమణరావుతో గొడవ పడింది. ఈ క్రమంలో రమణారావు తన అక్కను వెనక్కి తోశాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. ఆమె బతికి ఉంటే తనపై కేసు పెడుతుందనే భయంతో చీరతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో రమణారావుని గట్టిగా విచారించగా.. నిజం అంగీరించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.