వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. కొటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురైంది. అత్తగారి అభిమానం దక్కలేదు. పైగా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో.. వాటిని తట్టుకోలేక యువతి ప్రాణాలు విడవగా.. ఆమె లేని జీవితం నాకు వద్దు అంటూ భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన వీఆర్ఏ విజయ్ కుమార్ రెడ్డి(29), కామారెడ్డికి చెందిన రుచిత(25) ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకరాంతో పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరి వివాహం జరగగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే.. పెళ్లి తర్వాత రుచితకు కష్టాలు మొదలయ్యాయి. పెళ్లికి కట్నంగా రూ.6లక్షల నగదు, బంగారం ఇచ్చినా.. అదనపు కట్నం కోసం అత్తగారు వేధించడం మొదలుపెట్టారు. రోజు రోజుకీ ఈ వేధింపులు ఎక్కువగా పెరగడంతో రుచిత తట్టుకోలేకపోయింది. స్నేహితురాలిలా అండగా ఉండాల్సిన ఆడపడుచు కూడా సూటిపోటి మాటలతో వేధించేంది.

దీంతో.. ఆ బాధల్ని తట్టుకోలేకపోయిన రుచిత పురుగుల మందు తాగింది. అప్పుడే వచ్చిన భర్త విజయ్‌, వెంటనే తానూ తాగేశాడు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. గంటల వ్యవధిలో ఇద్దరూ కన్నుమూశారు. అమ్మానాన్నలు కావాలంటూ ఏడుస్తున్న వారి ఏడాదిన్నర పాప సాన్విత, మూడేళ్ల బాబు యువన్‌రెడ్డిలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.