వరంగల్‌: ఓ వ్యక్తి, తన గొంతును, మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ధర్మసాగర్‌ మండలంలో చోటు చేసుకుంది. అతని మతిస్థిమితం లేదని తెలుస్తోంది. పెద్దపెండ్యాలకు చెందిన నాజర్‌(52) అనే వ్యక్తి, గ్రామంలోనే ఓ చికెన్‌ షాపులో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. 

శనివారం మధ్యాహ్నం చికెన్‌ కోసం దుకాణానికి వచ్చిన ఓ కస్టమర్‌ నాజర్‌ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూశాడు. అతడి కేకలతో స్థానికులంతా చికెన్‌ షాపుకు చేరుకుని పరిశీలించారు. నాజర్‌ మర్మావయవాలు పక్కన కనిపించాయి. అతడి గొంతుపై కత్తిగాటు ఉంది. 

వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాజర్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 

ఏడాదికాలంగా నాజర్‌కు మతిస్థిమితం లేదని, అతడే కత్తితో తన అవయవాలను, గొంతును కోసుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని అతడి కుటుంబసభ్యులు ధ్రువీకరించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.