హుజూరాబాద్ లో ఓ భర్త నిద్రిస్తున్న, భార్య, కూతరిపై  పాశవికంగా దాడి చేసి చంపేసిన దారుణ ఘటన జరిగింది. ఈ దాడిలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ తగాదాలే దీనికి కారణంగా తెలుస్తోంది. 

కొక్కిసల వెంకటేష్, అతని భార్య రమ, కుమార్తె ఆమనిలను బుధవారం అర్థరాత్రి దాటాక నిద్రిస్తున్న వీరిని హత్యచేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పట్టణ సీఐ వాసం శెట్టి మాధవి, అదనపు డీసీపీ ఎస్. శ్రీనివాస్, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ రావు సంఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించి విలేకరులకు వివరాలను వెల్లడించారు. 

వెంకటేష్ ను తన మొదటి భార్య విడిచిపెట్టడంతో సుమారు 20 ఏళ్ల క్రితం రమను రెండో వివాహం చేసుకున్నాడు. కరీంనగర్ సమీపంలోని ఆరెపల్లికి చెందిన రమకు ఇది రెండో వివాహామే.. ఆమెకు అప్పటికే ఓ కూతురు ఆమని ఉంది. వెంకటేష్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. 

ఇదిలా ఉండగా వీరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. వారు ఉంటున్న ఇల్లు రమ పేరుపై ఉండటంతో వెంకటేష్ తన పేరున మార్చుకోవడానికి పలుమార్లు ఒత్తిడి చేశాడు. ఈ విషయమై తరచూ గొడవలు జరిగేవి. 

ఇల్లు కట్టిన సమయంలో, ఆమని పెళ్లి చేయడానికి వెంకటేష్ కొంత అప్పు చేశాడు. ఇంటితో పాటు ఆటోను అమ్మి అప్పు తీర్చాలని పలుమార్లు రమతో చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఈ విషయమై వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవన్నారు. భార్య రమ, కూతురు ఆమనిలపై వెంకటేష్ కక్ష పెంచుకున్నట్లు చెప్పారు. 

ఈ క్రమలోనే బుధారం రాత్రి అదను చూసిన వెంకటేష్ నిద్రిస్తున్న తన భార్య రమ, కూతురు ఆమనిలపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సాయిరూప గార్డెన్ వెనుక వీధిలో ఓ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. 

సాయంత్రం వరకు కాలనీవాసులతో కలిసి ఉన్న రమ, ఆమె కూతురు ఆమని తెల్లవారేసరికి మృత్యువాత పడటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. కట్టుకున్న భర్తు కడతేర్చడంతో మృతుల కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. నిందితుడు కొక్కిస వెంకటేష్ ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ రావు తెలిపారు.