ఎంతో ఇష్టపడ్డాడు.. ప్రేమించాడు.. పెళ్లిచేసుకున్నాడు.. పన్నెండేళ్లుగా అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ముచ్చటైన ముగ్గురు సంతానం. అరమరికలు లేని వారి కాపురంలో అనుమానపు భూతం ప్రవేశించింది. అంతే కాపురం ముక్కలయ్యింది. భర్త రాక్షసుడయ్యాడు.. ముగ్గురు పిల్లలు అనాథలవుతారన్న ఆలోచన, అనుమానంలో ఎంత నిజం ఉందన్న విచక్షణ మరిచిపోయి.. భార్యను కిరాతకంగా కొట్టి చంపేశాడు.

ఈ దారుణమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేసన్ పరిధిలో జరిగింది. స్థానికులు, ఇన్ స్పెక్టర్ కె. బాలరాజు కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ (32), రాజు పన్నెండేళ్ల కిందట ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. గాజులరామారం బతుకమ్మబండలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజుకు.. ఇక్కడ తన భార్య వేరేవ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న అనుమానం మొదలయ్యింది. 

దీంతో ఆమెను హెచ్చరించాడు కూడా. దీనిమీద తరచుగా గొడవలు కూడా జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో అక్రమసంబంధం పెట్టుకుందని అనుమానించిన వ్యక్తి ఇంటికి మంగళవారం నాడు ఆమెను పంచించాడు. ఆ వెనకే తానూ వెళ్లి పారకట్టెతో కొట్టాడు. 

స్థానికులు సర్దిచెబితే అప్పుడు కొట్టడం ఆపేశాడు. కానీ ఇంటికి వెళ్లాక మళ్లీ తీవ్రంగా కొట్టడంతో సువర్ణ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం పక్కింటివారి సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.