హైదరాబాద్:సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ  నిమ్స్‌లో దీక్షలో ఉన్న మధిర ఎమ్మెల్యేమల్లు భట్టి విక్రమార్కకు నిమ్మరసం ఇచ్చి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు దీక్షను విరమింపజేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకు భట్టి విక్రమార్క దీక్షను విరమించారు.

. భట్టి విక్రమార్కతో దీక్షను విరమింపజేసిన తర్వాత  నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు.సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో  కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ రకమైన ఘటనల ద్వారా  కాంగ్రెస్ పార్టీకే కాదు తెలంగాణకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంకు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.