హైదరాబాద్: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.  కరోనా విషయంలో ప్రజలకు  భయం పోయిందన్నారు. దీంతో కూడ  కరోనాపై ప్రజలకు నిర్లక్ష్యం పెరిగిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల మందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. అయితే వ్యాక్సినేషన్ ను ప్రతి రోజూ లక్షన్నరకు పెంచుతామని ఆయన చెప్పారు.

తెలంగాణపై మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ఆయన కోరారు. బయటకు వచ్చే సమయంలో మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ఆయన ప్రజలను కోరారు.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే  గతంలో కంటే  కేసుల తీవ్రత తక్కువగానే ఉందని ఆయన చెప్పారు.