తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ శుక్రవారం జరగనుంది. కాగా.. ఆ లోపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే..కొందరు అభ్యర్థులు తెలివిగా.. ఓటర్లకు అతి తక్కువ ధరకే మద్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే.. వారి పథకానికి పోలీసులు చెక్ పెట్టేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ సిటీ వైన్స్ వద్ద చోటుచేసుకుంది.

ఈ మాదాపూర్ వైన్స్ లో రూ.10కే రూ.460విలువచేసే మద్యం సీసా, రూ.50కి రూ.600 విలువచేసే మద్యం సీసా, అదే రూ.100 ఇస్తే.. రూ.వెయ్యి విలువచేసే మద్యం సీసాను అందిస్తున్నారు. అది కూడా ఎవరికి పడితే వారికి కాదు. ఇచ్చే నోటుకు సంబంధించిన సిరీస్‌ నెంబరు సరిపోలితేనే ఈ బంపర్‌ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. దీని గురించి తెలుసుకున్న మాదాపూర్‌ పోలీసులు నిందితులను బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సిటీ వైన్స్‌ మేనేజరు ప్రవీణ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వై.నాగేశ్వర్‌రావు తెలిపారు.