గురువారం ప్రేమికుల రోజు సందర్భంగా బజరంగదళ్ సభ్యుల నిర్వాకం ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యింది. సరదాగా పార్కులో గడుపుదామని వెళ్లిన ప్రేమజంటను గుర్తించిన బజరంగదళ్ సభ్యులు వారికి అక్కడిక్కడే పెళ్లిచేశారు. ఆ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన సదరు ప్రేమజంట ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డారు. 

మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజీ ఎదుట ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో ప్రేమికులరోజు సందర్భంగా బజరంగదళ్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు చెందిన ప్రేమ జంట వారికంటపడ్డారు. దీంతో వారిని బెదిరించి యువకుడితో యవతికి తాళి కట్టించి పెళ్లిచేశారు. అంతటితో ఆగకుండా ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మరింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట నిన్నటి నుండి ఇంటికి వెళ్లకుండా బయటే వుంటున్నారు. ఇవాళ  మద్యాహ్నం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న ప్రేమజంట హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన లేక్ పోలీసులు దీన్ని గమనించి ప్రేమికులిద్దరికి కాపాడారు.

వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు వారిద్దరిని అప్పగించారు.