వారిద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో తరచూ  ఎదురుపడే వీరిద్దరికి మొదట చూపులు ఆ తర్వాత మనసులు కలిశాయి. అయితే వీరి వేరువేరు కులాలు ప్రేమను అడ్డుకోలేకపోయాయి. అయితే అవే కులాలు వీరి పెళ్లికి మాత్రం అడ్డుపడ్డాయి. దీంతో ప్రాణంగా ప్రేమించుకున్న ఈ ప్రేమజంట పెద్దలని ఎదురించి కలిసి బ్రతకలేమని భావించి కలిసి చద్దామన్న దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

నారాయణఖేడ్ సమీపంలోని కంగ్టి మండలం చాప్టా గ్రామానికి చెందిన  కురుమ రవి(20), అనిత(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమను పెళ్లిపీటల వరకు  తీసుకెళ్లాలనుకున్న వీరిని  పెద్దల  అంగీకారం  లభించలేదు. కులాలు వేరయినందున  వీరి పెళ్లికి ఇరు కుటుంబాల  పెద్దలె అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు  గురైన ప్రేమజంట  దారుణ నిర్ణయం  తీసుకున్నారు. 

మొదట రవి పొలంవద్ద  వున్న ఓ చెట్టుకు  ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అనిత కూడా ఇంట్లో ఎవరులేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా  పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వీరిద్దరు ప్రాణాలను బలీతీసుకున్నారు. 

ఈ ఆత్మహత్యలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల నుండి జంట ఆత్మహత్యలపై  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా  స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.