హైదరాబాద్: తమ కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.నల్లగొండ జిల్లా కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్‌ నాయక్‌(25) హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని  శ్రీనివాసనగర్‌ కాలనీలో నివసించే స్వర్ణలత(21) బీటెక్‌ చదివింది. 

రెండేళ్ల క్రితం ఇరువురికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ విషయాన్ని పెద్దలకు చెప్పేందుకు భయపడ్డారు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో తమ పెళ్లికి వారు అంగీకరించరనే అభిప్రాయానికి వచ్చారు. 

ఈ నెల 7వ తేదీన స్వర్ణలత ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చింది. 8వ తేదీన రాత్రి 9.30కు చందానగర్‌లోని ఓ లాడ్జికి మోహన్‌ నాయక్‌తో కలిసి వచ్చింది. రెండు రోజులపాటు201 నెబంర్ గదిలో ఉన్నారు. సోమవారం ఉదయం బయటికి వెళ్లి, తిరిగి రాలేదు. తిరిగి  11.50కి లాడ్జికి చేరుకున్నారు. 

ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. స్వర్ణలత ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె మేనమామ పురుషోత్తం 7వ తేదీ సాయంత్రమే ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రేమ జంట మొబైల్  ట్రాకింగ్‌ పెట్టగా సోమవారం ఉదయం రైల్వేస్టేషన్‌ కు, లింగంపల్లికి, ఆ  తరువాత దగ్గరిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని సాయిబాబా ఆలయానికి వారు వెళ్లినట్లు సిగ్నల్‌ ద్వారా తెలిసింది. అక్కడి నుంచి వారు నేరుగా మధ్యాహ్నం లాడ్జి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.