ఓ జంట కొన్ని నెలలుగా ఒకరంటే మరొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా చేసేశారు. ఈ నెల 30వ తేదీ న పెళ్లి ముహుర్తం ఖరారు చేశారు. మరో 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ జంట యమపాశానికి చేరువయ్యారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా.కే గర్ామానికి చెందిన రవి(22), కురుమ అనిత(18) గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజికవర్గం కావడంతో వారిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించి గత నెల 21న నిశ్చితార్ధం చేశారు. ఈనెల 30న వివాహ ముహూర్తం ఖరారు చేశారు. 

ఈనేపథ్యంలో కురుమ రవి ప్రేమ వ్యవహారం, కుటుంబం గురించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల సోషల్‌ మీడియాలో అసభ్యకర కామెంట్లతో పోస్టులు పెట్టినట్లు సమాచారం. వీటిని చూసి మనోవేదనకు గురైన రవి ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈవిషయం తెలియగానే కురుమ అనిత ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.