జగిత్యాల: వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితంలో స్థిరపడి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు విదేశాలకు వెళ్లగా యువతికి పెళ్లిచేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన యువతి ఆత్మహత్య చేసుకోగా ఈ విషయం తెలిసి తట్టుకోలేక ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా జగిత్యాలలో ప్రియురాలు-దుబాయ్ లో ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన ఇటీవల చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే...  జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మానాల లస్మయ్య–అమృతవ్వ దంపతులకు ముగ్గురు కొడుకులు. మూడో కుమారుడు రాకేశ్‌ (21), అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే జీవితంలో బాగా స్థిరపడి ప్రియురాలి కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించిన రాకేష్ ఉపాది నిమిత్తం దుబాయ్ కి వెళ్లాడు.

అయితే యువతికి పెళ్ళిచేయాలని నిర్ణయించుకున్న కుటుంబసభ్యులు సంబంధాలు చూడటం ప్రారంభించారు. దీంతో ఎక్కడ ప్రేమించిన వాడికి దూరం అవుతానోనని మనస్థాపానికి గురయిన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి ఆత్మహత్య వార్త తెలియడంతో రాకేష్ కూడా దారుణ నిర్ణయం తీసుకున్నాడు. దుబాయి క్యాంపులోని గదిలో శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు రాకేశ్‌ సెల్ఫీ వీడియో తీసుకుని స్నేహితుడికి పంపించాడు. ఈ ఆత్మహత్యలతో ఇరు కుటుంబాల్లోనే కాదు గ్రామాల్లోనూ విషాదం చోటుచేసుకుంది.