కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది విద్యార్థులు ఉన్నారు. 

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. వాంకిడి మండలంలోని ఖామన, కనర్‌గాం, కోమటిగూడ, ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు సెయింట్ మేరీస్ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నారు. 

సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు చెందిన బస్సు రోజు మాదిరిగానే విద్యార్థులను ఇంటికి వద్దకు దించేందుకు బయలుదేరింది. బస్సు బెండార సమీపంలోకి రాగానే.. ఎదురుగా అతి వేగంతో లారీ వచ్చింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును రోడ్డు కిందకు దించాడు. అయితే వేగంగా వచ్చిన లారీ.. బస్సు వెనక భాగాన్ని ఢీకొట్టి.. ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వెనక సీట్​లో కూర్చున్న నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులు భీంపూర్ గ్రామానికి చెందిన మిట్ట విష్ణు, గంగిశెట్టి కార్తీక్, పుల్లం సతీష్, పుల్లం సహర్షిత్‌గా గుర్తించారు. 

వీరిలో సహర్షిత్‌ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో సహర్షిత్‌ను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మిగతా ముగ్గురు పిల్లలను కూడా మంచిర్యాకే తీసుకొచ్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ఆధారంగా.. ప్రమాదం జరిగిన అనంతరం ఆగకుండా వెళ్లిపోయిన లారీని పోలీసులు గోలేటి ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను రెబ్బన మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన బండి తులసీరామ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.