తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా సాగాయి. తొలుత.. టగ్ ఆఫ్ వార్ గా మొదలైనప్పటికీ.. చివరకు వార్ వన్ సైడ్ గా మారింది. భారీ ఆధిక్యంతో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.  దాదాపు టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. ఈ సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నేతలు కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

మహాకూటమి తరుపున ఎన్నికల బరిలోకి దిగి.. ఓటమి పాలైన ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఘెర పరాభావాన్ని చవిచూశారు. గతంలో రెండు సార్లు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన రేవంత్.. ఈసారి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. మరో కీలకనేత కె.జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీచేసి.. ఓటమి చవిచూశారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసిన పొన్నం ప్రభాకర్ కూడా ఓటమి దిశగా సాగుతున్నారు.

సీపీఐ పార్టీ నేత చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. జనగామ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పొన్నాల లక్ష్మయ్య కూడా ఓటమి దిశగా సాగుతున్నారు. మరో కీలక నేత గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి.. ఓటమిపాలయ్యారు. 

ఇక మహాకూటమి తరపు  నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సుహాసిని కూడా ఓటమి పాలయ్యారు. ఆమె ఎన్నికల్లో పోటీచేస్తున్నాను ప్రకటించనాటి నుంచి.. దాదాపు అందరి దృష్టి ఆమెపైనే. ఆమె గెలుపు మీద.. చాలా మంది బెట్టింగ్ లు కూడా కాశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బలరాం నాయక్.. వెనుకంజలో ఉన్నారు. మధిర నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై రంగంలోకి దిగిన వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఘోర పరాజయం పొందారు.

కాంగ్రెస్ నుంచి ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన దామోదర రాజనర్సింహ కూడా  ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. గద్వాల నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసిన సీనియర్ నేత డీకే అరుణ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు.

నల్గొండ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన కోటమి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. పరకాల నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసిన కొండా సురేఖ కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆర్ కృష్ణయ్య వెనుకంజలో ఉన్నారు. 

మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సబితా ఇంద్రారెడ్డి, కామారెడ్డి నుంచి పోటీచేసిన షబ్బీర్ అలీ, నర్సాపూర్ నుంచి రంగంలోకి దిగిన సునీతా లక్ష్మారెడ్డిలు కూడా ఓటమి చవిచూశారు.