జగిత్యాల: లాక్ డౌన్ సమయంలో ఓ నిరుపేద వివాహిత చెట్టు క్రిందే ప్రాణం వదిలిన విషాద సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. గతకొంత కాలంగా చెట్టుకిందే భర్త, బిడ్డలతో కలిసి జీవిస్తున్న మహిళ అనారోగ్యానికి గురయ్యింది. లాక్ డౌన్ తో ఆ అనారోగ్యం మరింత తీవ్రరూపం దాల్చి చివరకు ఆమె ప్రాణాలను బలితీసుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు.  

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల ప్రాంతంలో ఓ వలస నిరుపేద కుటుంబం చెట్టు కింద  జీవిస్తోంది. గత మూడు నెలలుగా ఆ కుటుంబానికి ఆ చెట్టె ఇల్లుగా మారింది. చెట్టు కిందే ఉంటూ ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి భర్త రమేష్ జీవనం సాగిస్తున్నాడు. అతడు తాళంచెవిలు తయారుచేసే వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

"

అయితే లాక్ డౌన్ కారణంగా రమేష్ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు అతడి భార్య  అనారోగ్యంతో కొద్ది రోజులుగా మగ్గిపోతూ... తాజా పరిస్థితుల్లో తినడానికి తిండిలేక చిక్కి శల్యమై శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో భార్య అంత్యక్రియలు కూడా జరపలేని దీనస్థితిలో వున్న అతడికి  మున్సిపల్ సిబ్బంది సహకారం అందించారు.

రమేష్ కుటుంబానికి ఎవరూ దిక్కు లేకపోవడంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులే బంధువులుగా మారారు. వారి పరిస్థితి తెలుసుకుని జాలిపడి మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులే తీసుకువెళ్లి ఖననం చేయించారు. ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పారిశుద్ద కార్మికులకు స్థానికులు అభినందించారు.