నాగర్‌కర్నూల్: కృష్ణా నదిలో పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ నది మార్గం ద్వారా సులభంగా ఏపీకి పశువులను తరలిస్తున్నారు. 

ఈ నీటిలో పశువులు ఈదుకొంటూ ప్రయాణం సాగిస్తున్నాయి. పశువులను మూతికి తాడుకట్టి తాము ప్రయాణించే బోటులో నిలబడి పశువులకు కట్టిన తాడును లాగుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల, సిద్దేశ్వరం నుండి కృష్ణా నది నుండి అక్రమంగా పశువులను అవతలి ఒడ్డు సిద్దేశ్వరానికి తరలిస్తున్నారు.  సోమశిల నుండి సిద్దేశ్వరానికి రెండు కిలోమీటర్లు ఉంటుంది. నదిలో రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంటే  కనీసం రెండు గంటల సమయం పడుతోంది. 

రెండు గంటల పాటు  పశువులు ఈ నది నీటిలో విలవిల్లాడుతూ ప్రయాణం సాగిస్తున్నాయి. పశువుల  మూతికి తాళ్లు కట్టి ఆ తాళ్లను తెప్పకు కట్టి తీసుకెళ్తున్నారు.

రోడ్డు మార్గం ద్వారా పశువులను తరలించాలంటే చాలా దూరం. ఖర్చు కూడ ఎక్కువ. నదిని రెండు కిలోమీటర్లు దూరం దాటితే దూరభారం తగ్గడంతో పాటు ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. రోడ్డు మార్గం ద్వారా అయితే కనీసం 200 కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో కృష్ణా నది ద్వారా ప్రయాణం చేస్తున్నారు.

అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున పశువులను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.  అక్రమంగా పశువులను తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రతి బుధవారం నాడు సింగోటంలో పశువుల సంత జరుగుతోంది. పశువులను కొనుగోలు చేసిన రైతులు మూగజీవాలను నదిలో ఒడ్డుకు తరలిస్తున్నారు.