తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు వుంటాయా లేదా అన్న టెన్షన్‌లో వున్న మందుబాబులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరిచేందుకు అవకాశం లేదు. ఇదే సమయంలో లాక్‌డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తర్వాత ఆంక్షలు అమల్లోకి వస్తాయి.

దీంతో అబ్కారీశాఖ అధికారులు మద్యం దుకాణాలను తెరిచే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూశారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉదయం ఆరు గంటలకే మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. 

Also Read:తెలంగాణలో లాక్ డౌన్: వీటికి మినహాయింపులు, పెళ్లిళ్లూ అంత్యక్రియలపై ఆంక్షలు

కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి నిమిత్తం పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి 22 వరకూ ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. లాక్‌డౌన్ విధించడంతో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపమని ఆర్టీసీ ప్రకటించింది. వ్యవసాయ రంగానికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఈ నెల 20 కేబినెట్ మరోసారి సమావేశమై లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.