కరీంనగర్: పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో హైకోర్టు న్యాయవాది పీవి.నాగమణి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. మంథని మండలం గుంజపడుగ గ్రామంలోని రామాలయం విషయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె డీసీపీతో వాపోయింది. సీపీకి, 100 డయల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

కుంట శ్రీను అనే వ్యక్తి జోక్యం చేసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె డీసీపీని కోరింది. అయితే డీసీపీ మాత్రం సర్పంచ్ సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోరని డీసీపీ చెప్పారు. అడ్వకేట్ నాగమణి, డీసీపీకి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: రెండు గంటల్లో ప్లాన్.. టార్గెట్ వామనరావు.. సాక్ష్యం ఉండొద్దనే భార్య హత్య

తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య కేసుతో ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా పుట్ట మధుకు సంబంధం ఉందని ఆరోపించారు. దరఖాస్తు చేసేప్పుడు పోలీసులు చెప్పినట్టుగా రాశానని, నిందితులను మార్చివేశారని అన్నారు. 

గ్రామ కక్షలని చెప్తున్నారనీ.. తమకు శత్రువులు ఎవరూ లేరని, సుపారీ ఇచ్చి హత్య చేయించారని చెప్పారు. న్యాయవాదుల ద్వారా మళ్లీ పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

న్యాయవాదుల జంట హత్య కేసులో నిందితులను పోలీసులు మంథని జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర రావు ముందు ప్రవేశపెట్టారు. ఏ1 కుంట శ్రీను, ఎ2 సెమంతుల చిరంజీవి, ఎ3 అక్కపాక కుమార్ లను పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని కరీంనగర్ జైలుకు తరలించారు.