తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఇవాళ్టీతో ఈ డిస్కౌంట్ గడువు ముగియనుంది. దీంతో వాహనదారులు తమ చలాన్లు క్లియర్ చేసేందుకు పోటీపడుతున్నారు.
తెలంగాణలో (telangana govt) ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కి (pending challan) భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయల చలాన్లు క్లియర్ చేశారు. పెండింగ్ చలాన్ల రూపంలో ప్రభుత్వానికి రూ.300 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. 65 శాతంపైగా పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారు వాహనదారులు. హైదరాబాద్‌లో కోటి 70 లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా.. తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు ఇచ్చిన బంపర్ ఆఫర్ గడువు నేటితో ముగియనుంది. ఇటీవల వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియనుంది. వాహనదారులకు వివిధ రూపాల్లో విధించిన చలాన్లు భారీగా పెండింగ్ లో ఉండటంతో డిస్కౌంట్ ఆఫర్ ను ప్రభుత్వం అమలు చేసింది. దీంతో తక్కువ మొత్తంలో చెల్లించే అవకాశం రావడంతో తమ వాహనాలపై ఉన్న చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకుంటున్నారు.
టూవీలర్, త్రీ వీలర్ కు 75శాతం, ఆర్టీసీ డ్రైవర్స్ 70 శాతం, లైట్ మోటార్ వెహికిల్స్, హెవీ మోటర్ వెహికల్స్ కు 50శాతం, తోపుడు బండ్ల వ్యాపారులపై 80 శాతం, నో మాస్క్ కేసులపై 90శాతం మాఫీ ప్రకటిస్తూ ప్రభుత్వం వెల్లడించింది. మార్చి1 నుండి మార్చి 31 వరకు అవకాశం కల్పిస్తూ ఈ ఆఫర్ ను తొలుత ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి 31 నాటికి అనుకున్న టార్గెట్ పూర్తికాకపోవటంతో ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది. సాయత్రం వరకు డిస్కౌంట్ ఆఫర్‌లో చలాన్లు చెల్లించక పోతే శనివారం నుంచి చలాన్ల మోత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాహనదారులు క్లియరెన్స్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు.
