హైదరాబాద్: ఆంధ్రా ఆక్టోపస్ గా పేర్గాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే తెలంగాణలో బెడిసికొట్టింది. మెుదటి నుంచి తెలంగాణలో ప్రజలనాడి కాంగ్రెస్ వైపే ఉంటుందని చెప్పిన లగడపాటి రాజగోపాల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి ఎన్నికల ఫలితాలు. 

లగడపాటి చెప్పినట్లు ఎక్కడా కూడా 10 మంది స్వతంత్రులు విజయకేతనం ఎగురవేసే స్థాయిలో కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు ఇండిపెండెంట్లు మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు. దీంతో ఇండిపెండెంట్ల వ్యవహారంలో ఆంధ్రా ఆక్టోపస్ సర్వే బోల్తా కొట్టిందని చెప్పుకోవాలి. 

ఇకపోతే ప్రజాకూటమికి 65 నుంచి 75 స్థానాలు వస్తామంటూ లగడపాటి రాజగోపాల్ తన ఎగ్జిట్ పోల్ లో చెప్పారు. అటు టీఆర్ఎస్ పార్టీకి 35 నుంచి 45 స్థానాలు లేదా పోలింగ్ శాతం అత్యధికంగా నమోదైతే 25 స్థానాకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందంటూ ప్రకటించారు. కానీ ఫలితాలు రివర్స్ లో వచ్చాయి. 

లగడపాటి రాజగోపాల్ సర్వేకు దొరకకుండా ఓటరు తీర్పునిచ్చారు. లగడపాటి సర్వే అంఛనాలను సైతం తారుమారు చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వేలో ఈ సర్వే చెత్తదిగా టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

ఇకపోతే పోలింగ్ శాతం పెరిగితే టీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం తప్పదంటూ లగడపాటి జోస్యం చెప్పారు. కానీ తెలంగాణలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 68.5శాతం పోలింగ్ నమోదైతే ఇప్పుడు 73 శాతం పోలింగ్ నమోదైంది. 

పోలింగ్ శాతం అత్యధికంగా నమోదైనా టీఆర్ఎస్ గెలుపును ఆపలేకపోయింది. అత్యధిక పోలింగ్ శాతం కొంపముంచింది టీఆర్ఎస్ పార్టీకి కాదు కాంగ్రెస్ కేనని ఫలితాలను బట్టి అర్థమవుతోంది.  

 మరోవైపు లగడపాటి రాజగోపాల్ సర్వేపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ లగడపాటి రాజగోపాల్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు దాడి చేస్తున్నాయి. రెండు చిలకలను పంపుతాం జోస్యం చెప్పుకోవాలంటూ హితవు పలికారు కూడా. 

గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ప్రసక్తేలేదని ఒక వేళ ఏర్పడితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని లగడపాటి ప్రకటించారు. అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి అన్న చందంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది తెలంగాణ విషయంలో లగడపాటి అంచనాలను తారుమారు చేసింది. 

తాజాగా తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి తన ఎగ్జిట్ పోల్ లో ప్రకటించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. లగడపాటి ఎగ్జిట్ పోల్ కు వచ్చిన ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదు. దీంతో రెండో సారి తెలంగాణ విషయంలో లగడపాటికి గట్టి షాక్ తగిలింది. 

మరోవైపు లగడపాటి ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో లగడపాటి ఎగ్జిట్ పోల్ కంటే టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిస్తే ఇక సర్వేల సన్యాసం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు కూడా. మరి కేటీఆర్ సవాల్ కు లగడపాటి సర్వే సన్యాసం తీసుకుంటారా లేక ఆ తూచ్ అంటూ నీళ్లొదిలేస్తారో చూడాలి. 

అంతేకాదు లగడపాటి సర్వే పేర్లతో తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో లగడపాటి ఎగ్జిట్ పోల్ కంటే కేటీఆర్ చెప్పిన ఎగ్జిట్ పోల్ నిజమనిపిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఓటమిపాలవుతారని చెప్పిన కేటీఆర్ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధులైన పలువురు నేతలు ఇప్పటికే వెనుకంజలో పడ్డారు. అదే వాస్తవమైతే కేటీఆర్ ఎగ్జిట్ పోల్ నిజమని తేలనుంది.