రెండు నెలల్లోనే మారిన సీన్.. తిరిగి కాంగ్రెస్ గూటికి కుంభం అనిల్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన యాదాద్రి-భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన యాదాద్రి-భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే రెండు నెలలు కాకముందే ఆయన సొంతగూటికి చేరడం గమనార్హం.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో యాదాద్రి-భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ ఏడాది జూలై 24న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనిల్ కుమార్‌తో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
అయితే గత నెలలో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీఆర్.. భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికే మరోమారు అవకాశం ఇచ్చారు. అయితే ఈ పరిణామాలతో కుంభం అనిల్ తీవ్ర అసంతృప్తి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి కుంభం అనిల్ తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రచారాన్ని ఆయన ఖండించినప్పటికీ.. తాజాగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.