కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచమంతా వణికిపోతున్న వేళ, ప్రజలకు, ఈ వైరస్ కి మధ్య అడ్డుగోడలా నిలుస్తూ.... వైరస్ బారినుండి ప్రజలను మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాపాడుతున్నారు. డాక్టర్లు, పారిశుధ్య కార్మికుల నుండి మొదలు పోలీసుల వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ, ఈ ఆపద సమయంలో పోరాడుతున్నారు. 

ఇలా తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే, ఎందరో నిస్వార్థమైన ప్రజాసేవకులు, ఈ కష్టకాలంలో ఆపదలో ఉన్న ప్రజలకు అండగా కూడా నిలుస్తున్నారు. తమకింక దిక్కు లేదు అనుకుంటున్న తరుణంలో ప్రజలకెవరికైనా సమస్య వచ్చిందంటే అక్కడ వాలిపోయి వారి సమస్యను కూడా పరిష్కరిస్తున్నారు. 

తాజాగా ఇలా ఈ కష్టకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చిక్కుబడ్డ హిమాచల్ ప్రదేశ్ ఉద్యోగికి పోలీస్ సీఐ సహాయాన్ని అందించి అందరికీ ఆదర్శనీయంగా నిలిచాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని సర్జరీ నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ చెయ్యడమే కాకుండా, అతడి హాస్పిటల్ బిల్లును కూడా కట్టాడు. 

వివరాల్లోకి వెళితే... కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న లక్ష్మి నారాయణ రెడ్డికి కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి ఒక వ్యక్తి అనరయోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడన్న సమాచారం అందింది. 

వెంటనే అక్కడికి తన సిబ్బందితో సహా చేరుకున్న సదరు ఇన్స్పెక్టర్, హైదరాబాద్ మెట్రో రైల్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లలిత్ కుమార్ అనే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించాడు. 

అపెండిక్స్ నొప్పితో బాధపడుతున్న అతనికి సర్జరీ చేసి దాన్ని తొలగించాలని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో సర్జరీ చేయించుకునేంత డబ్బు అతనివద్ద లేదు. కేవలం అతని వద్ద 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని సదరు ఇన్స్పెక్టర్ తెలుసుకున్నారు. 

వెంటనే ఆసుపత్రి వర్గాలను సర్జరీకి ఎంతవుతుందని అడిగాడు. వారు 25,000 వరకు ఖర్చు అవుతుందనడంతో మిగిలిన 20,000 తాను తన సొంత డబ్బును కట్టాడు. సదరు ఇన్స్పెక్టర్ డబ్బు కట్టడం తెల్లవారి ఉదయమే ఆ యువకుడికి ఆపరేషన్ కూడా పూర్తయింది. 

ఇలా ఇన్స్పెక్టర్ నిస్వార్థమైన సేవను గుర్తించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ లేఖ ద్వారా పోలీస్ ఆఫీసర్ కి థాంక్స్ చెప్పడంతోపాటుగా, ఇలాంటి నిస్వార్థమైన సేవ ఎందరికో ఆదర్శమని కూడా ప్రశంసించారు.