కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని  టీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు. వారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో వారికి ఉన్న సమస్యలు ఏంటో కూడా అడిగి తెలుసుకున్నారు. అదేంటి..? టీడీపీ అభ్యర్థి.. టీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించడం ఏమిటి అనుకుంటున్నారా..? ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి అభ్యర్థి సుహాసినికి పాదయాత్ర చేస్తుండగా.. ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

పాదయాత్ర ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న నందమూరి సుహాసినికి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎదురయ్యారు. టీఆర్ఎస్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న మహిళల వద్దకు సుహాసిని వెళ్లి పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసి.. ఆప్యాయంగా పలకరించారు. 

ఈ సందర్భంగా తాము ఎన్టీఆర్ అభిమానులమని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఈ పరిణామంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒక్కసారిగా షాకయ్యారు. 

సాధారణంగా రెండు ప్రత్యర్థి పార్టీలు ప్రచార సమయంలో ఎదురైతే.. దాదాపు గొడవలు అయిపోతాయి. అయితే.. ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదు. సుహాసిని ప్రేమగా.. నవ్వుతూ వారిని పలకరించడంతో.. వారు అంతే ఆప్యాయంగా ఆమెతో మాట్లాడారు. కాగా  సంఘటన స్థానికంగా చర్చనీయాంశమయింది.