హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీ విలీనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎల్పీ విలీనంపై, పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 

హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ ఫిరాయింపులకు, విలీనాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. 

ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని రద్దు చేసి యమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఆయారాం, గయారాంలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు.  2005లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదా అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించారు. 

ఆనాడు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ను కలిస్తే సమాధానం చెప్పలేదని ఆ నాడు విలీనం కూడా జరపలేదని స్పష్టం చేశారు. సీఎల్పీ విలీనం రాజ్యాంగ విరుద్ధంగా జరిగితే కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటం చేయోచ్చని సూచించారు. స్పీకర్ ఉన్నారు, న్యాయ స్థానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని వారంతా పార్టీలో చేరతామంటే తాము వద్దు అనలేకపోయామన్నారు. అంతేకానీ తాము ఎవరినీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలకు ముంద తమ పార్టీకి చెందిన ఎంపీలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆనాడు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలను ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పితే తప్పులేదు కానీ తాము చేస్తే తప్పా అని నిలదీశారు. సీఎల్పీ విలీనం అనేది రాజ్యాంగ బద్దంగా, మర్యాదగా వ్యవహరించామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.