హైదరాబాద్: త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో  వైసీపీ విజయం సాధించనుందని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు చేతకానితనం వల్లే టీడీపీ ఏపీలో ఓటమి కానుందన్నారు.

శనివారం నాడు కేటీఆర్ హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తమకు ఉన్న సమచారం మేరకు ఏపీలో వైసీపీ విజయం తథ్యమన్నారు. బాబు చేతకానితనం వల్లే ఏపీలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబునాయుడు ప్రజలను వేధింపులకు గురి చేశారని ఆయన ఆరోపించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  అమలు చేయడంలో చంద్రబాబునాయుడు వైఫల్యం చెందాడన్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు, విజయవాడలో కూడ చక్రం తిప్పలేడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని చెబుతూనే, తామే నెంబర్ వన్ చంద్రబాబునాయుడు చంకలు గుద్దుకొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  ఐటీ దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. అయితే ఏపీలో దాడులపై చంద్రబాబునాయుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో చెప్పాలన్నారు.

వచ్చే నెల 12వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఐదు స్థానాలను కైవసం చేసుకొంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలో, వద్దో అనే విషయాన్ని తేల్చుకోవాల్సింది కాంగ్రెస్, టీడీపీలేనని ఆయన చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. దేశంలో రాహుల్, మోడీ మధ్య ఈ ఎన్నికల్లో పోటీ నెలకొంటుందనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ...దేశంలో ఈ రెండు పార్టీలే లేవన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో లేచే పరిస్థితి లేదన్నారు.