హైదరాబాద్: ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.గురువారం నాడు హైద్రాబాద్‌లో 2020-21 ఐటీ వార్షిక నివేదిక విడుదల చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దార్శనికత వవల్ల దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతుందన్నారు.  అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు.

 

క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్దిని సాధించామన్నారు.సాధించిన ప్రగతిని తెలిపేందుకే నివేదికలు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమల పెరుగుదల 20.9 శాతంగా ఉందన్నారు. దేశంలో తలసరి ఆదాయం 1లక్షా 27 వేలుగా ఉంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2.లక్షల 27 వేలు గా ఉందని ఆయన చెప్పారు.గత ఏడాది కంటే ఈ ఏడాది ఐటీ ఎగుమతులు పెరిగాయని మంత్రి తెలిపారు.

దేశ ఎగుమతుల్లో దేశ వృద్ది రేటు కంటే  రాష్ట్ర వృద్ది రేటు రెండింతలు ఎక్కువేనని చెప్పారు. తెలంగాణ రాకముందు ఐటీ రంగంలో 3.28 లక్షల ఉద్యోగాలున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఐటీ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు  అయిందని ఆయన చెప్పారు. పారిశ్రామిక రంగాల దిగ్గజాలు కూడ తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. టీఎస్ఐసీసీ కొత్తగా ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.