హైదరాబాద్: కజకిస్తాన్ ఎయిర్‌పోర్టులో చిక్కుకొన్న 14 మంది మెడికోలను తెలంగాణ రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నామని మెడికోలు చేసిన ట్వీట్ కు మంత్రి స్పందించారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 మంది విద్యార్థులు కజకిస్తాన్ లో మెడిసిన్ చదువుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా కజకిస్తాన్ పూర్తిగా షడ్ డౌన్ చేశారు. దీంతో వీరంతా ఇండియాకు బయలుదేరాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి.

also read:మహారాష్ట్రలో కరోనాతో ఒకరు మృతి, దేశంలో 324 పాజిటివ్ కేసులు

మూడు రోజులుగా కజకిస్తాన్ ఎయిర్ పోర్టులోనే వీరంతా ఎదురుచూస్తున్నారు. విదేశీ విమానాలు నిలిచిపోవడం ఇతరత్రా కారణాలతో  తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు తమ  ఇబ్బందులను కేటీఆర్ కు ట్వీట్ ద్వారా తెలిపారు.

ఈ ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. విద్యార్థులను స్వరాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జీఏడీ అధికారులు విదేశాంగ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు చేపట్టారు.  కజకిస్తాన్ అధికారులతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ విషయమై చర్చించారు.14 మంది విద్యార్థులకు బస ఏర్పాట్లు చేస్తామని ఇండియన్ ఎంబసీకి కజకిస్తాన్ అధికారులు హామీ ఇచ్చారు.