స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొననుంది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొననుంది. ఇందుకు కేటీఆర్ నేతృత్వంలోని బృందం శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్లింది. ఈ బృందం ఆదివారం మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకుంటుంది. అక్కడి నుండి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటుంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కేటీఆర్ బృందం ఈ పర్యటన చేపట్టింది. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సెషన్‌లో పాల్గొనడంతో పాటుగా.. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్స్‌లో కూడా కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి సంస్థలకు పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడం, ప్రైవేట్ రంగంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల, పరిశ్రమ అనుకూల విధానాలను హైలైట్ చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నారు. 

ఇదిలా ఉంటే.. ‘‘తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైంది’ అని కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే కొనియాడారు. ఇక, దావోస్‌కు తెలంగాణ ప్రతినిధి బృందాన్ని పంపడం ఇది ఐదవసారి. తెలంగాణా 2018లో మొదటిసారిగా డబ్ల్యుఇఎఫ్‌కు ప్రతినిధి బృందాన్ని పంపింది. అయితే 2021లో కరోనా కారణంగా ఈ సదస్సును నిర్వహించలేదు. 

ఇక, మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌, ఆటోమోటివ్‌ విభాగం డైరెక్టర్‌ గోపాల్‌ కృష్ణన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం తదితరులు ఉన్నారు.