హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో గులాబీదళం తెగ సంబరపడిపోతుంది. ముఖ్యంగా బుల్లి దళపతి కేటీఆర్ అయితే మామూలుగా లేరు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ తర్వాత కీలక పాత్ర పోషించిన ఆయన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. 

ఇకపోతే ఏపీలో వేలుపెడతామంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పలు కీలక కామెంట్లు చేశారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతోందని కితాబిచ్చారు. అయితే ఆపార్టీ తరపున ప్రచారంపై త్వరలో క్లారిటీ ఇస్తానన్నారు. అయితే ఏపీలో కాలుపెట్టడం మాత్రం పక్కా అన్నారు.


మరోవైపు తెలంగాణలో సీఎం కేసీఆర్ తోపాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారో చెప్పలేమన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లను చూస్తుంటే జాలేస్తోందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 16 లోక్ సభ స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. 

ఇకపోతే ఏపీలో రాజకీయ ప్రవేశంపై ఇప్పటి టీఆర్ఎస్ మిత్ర పక్షం ఎంఐఎం వైఎస్ జగన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ వైసీపీకి మద్దతు ప్రకటించడంతోపాటు ఏపీలో ప్రచారం చేస్తానని తెలిపారు. తన ప్రచారం ప్రభావం చంద్రబాబు నాయడుకు చూపిస్తానంటూ సవాల్ కూడా విసిరారు.