హైదరాబాద్: తెలంగాణలో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రాన్ని శాసించి రాష్ట్రాభివృద్ధిని చేసుకోవడం సులభమౌతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.  తెలంగాణలో టీఆర్ఎస్ విజయానికి  సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్  విజయోత్సవ ర్యాలీని ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  ఎన్డీఏకు 150 ఎంపీ సీట్లు కూడ దక్కే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు కనీసం 100 ఎంపీ  సీట్లను దక్కించుకొనే పరిస్థితి లేదన్నారు.

తెలంగాణలోని 16 ఎంపీ సీట్లను  గెలుచుకొంటే  కేంద్రాన్ని శాసించే పరిస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ సీట్లను కైవసం చేసుకొంటే హైద్రాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు.

ఎన్నికల ముందు సుమారు 22 లక్షల ఓట్లను తొలగించడం వల్ల  టీఆర్ఎస్ అభ్యర్థుల మెజారిటీ భారీగా  తగ్గిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  వచ్చినా కూడ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని ఆయన తెలిపారు.ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఈసీ అవకాశం ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ఆయన  కోరారు.