హైదరాబాద్‌: ఎన్టీ రామారావు సతీమణి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత లక్ష్మీపార్వతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా సినీ నటి పూనం కౌర్ వ్యక్తిగత సంభాషణలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోటి ఎట్టకేలకు లొంగిపోయాడు. హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో అతను మంగళవారం లొంగిపోయాడు. 

తాను కొడుకులా చూసుకుంటే అతను సోషల్‌మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేశాడని లక్ష్మిపార్వతి ఏప్రిల్‌ 15న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కోటి చేసిన ఆరోపణలను కొన్ని టీవీ చానెళ్లతోపాటు సోషల్‌ మీడియాలో ఎలాంటి వివరణ లేకుండా ప్రసారం చేసి తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు.

సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్ అయిన కోటిని కొడుకుగా భావించి ఇంట్లోకి ఆహ్వనించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని లక్ష్మిపార్వతి చెప్పారు. తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో గౌరవించారని అన్నారు. తన తరఫున ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు, వాట్సాప్‌ సందేశాలు పంపించాలని కోటికి చెప్తే దాన్ని అవకాశంగా తీసుకున్నాడని, తప్పుడు మెసేజ్‌లు పంపి బురదజల్లే ప్రయత్నం చేశాడని ఆమె వివరించారు. 

నటి పూనంకౌర్‌ వ్యక్తిగత సంభాషణలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి హల్‌చల్‌ చేసింది కూడా కోటియేనని సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. తన ఫోన్‌ నుంచి వ్యక్తిగత డేటా, కాల్‌ రికార్డింగ్‌లు సేకరించి వాటిని సోషల్‌మీడియా ద్వారా వైరల్‌ చేశారని పూనం కౌర్ గతంలో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ రెండు కేసుల్లోనూ అతడే నిందితుడని నిర్ధారించిన సీసీఎస్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ స్థితిలో అతను కోర్టులో లొంగిపోయాడు. ఒంగోలులో కేఏపాల్‌ సోదరుడు డేవిడ్‌రాజ్‌ హత్య కేసులోనూ కోటి నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.