కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధిక్యత కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చందర్ మెుదటి నుంచి తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎస్ రాజ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. అయితే రామగుండం నియోజకవర్గంలో చందర్ విజయం సాధించడం తథ్యమంటూ ప్రచారం కూడా జరుగుతుంది. తాజాగా తనకు మంత్రి పదవి ఇస్తేనే తన మద్దతు ఉంటుందని ఇప్పటికే చందర్ ప్రకటించారు కూడా. 

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.