తెలంగాణ పీసీసీని సమూలంగా మార్చేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధఫడినట్లు చెబుతున్నారు. ఇందులో భాగాంగనే కొండా సురేఖకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీతక్క కూడా కీలకమైన పదవి పొందే అవకాశాలున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కూర్పులో కాంగ్రెసు అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించాలనే నిర్ణయం జరిగిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా ఉండే నేతలకు తెలంగాణ పీసీసీలో కీలకమైన పదవులు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పాత కాంగ్రెసు నాయకుల వల్ల కానిదాన్ని కొత్తగా పార్టీలోకి వచ్చినవారితో పీసీసీని ఏర్పాటు చేసి సాధించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తుది దశలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సహకరించే నేతలకు కీలకమైన పదవులు అప్పగించే ఆలోచన చేస్తోంది.
వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుోతంది. పార్టీని వదిలిపెట్టిన డికె అరుణ, విజయశాంతిలకు ధీటుగా మహిళా నాయకురాలిని ముందు పెట్టాలనే ఆలోచనలో భాగంగానే కొండా సురేఖ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో తనను విస్మరించారని ఆవేదన చెందుతున్న సీతక్కను మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలి పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహిళా కాంగ్రెసు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కాగా, మహిళా అధ్యక్షురాలి పదవి కోసం సునీతారావు, సుజాత పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలిగా ఉన్న నేరెళ్ల శారదకు, మరో ేత ఇందిరా శోభన్ లకు కమిటీల్లో కీలక పదవులు అప్పగించే అవకాశం ఉంది. మైనారిటీ వర్గానికి చెందిన ఉజ్మా షకీర్ కు కూడా తగిన స్థానాన్ని కల్పించే అవకాశం ఉంది.
మొత్తంగా తెలంగాణ కాంగ్రెసు పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం సిద్ధపడినట్లు కనిపిస్తోంది. అవసరమైతే సీనియర్ కాంగ్రెసు నాయకులను కూడా వదులుకోవడానికి అధిష్టానం సిద్ధపడినట్లు చెబుతున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 27, 2020, 9:21 AM IST