న్యూఢిల్లీ: బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను పార్టీమారతానంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 

తన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా హాజరయ్యేందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. అందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కష్టపడ్డారో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఉంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చేదని చెప్పుకొచ్చారు. జగన్ సీఎం అయ్యారంటే అతను నిత్యం ప్రజలతోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పుకొచ్చారు. 

మరోవైపు తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే ఇంత దుర్భర పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. 

తాను పార్టీ మారే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని అంతవరకు పార్టీ మారే యోచనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.