హైదరాబాద్: నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపిలో చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మునుగోడుకు చెందిన ముఖ్య నాయకులతో బుధవారం రాత్రి హైదరాబాదులోని తన నివాసంలో ఆయన భేటీ అయ్యారు. 

తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, భాజపాలో కీలక పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. మండలానికి అయిదారుగురు ముఖ్య నాయకులను పిలిపించుకొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడే విషయంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

పార్టీ మార్పిడిపై బహిరంగ ప్రకటన చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దానికి ముందు అంబర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.