హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎక్కడికి జంప్ అవుతారో క్షణాల్లో జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో అయితే అది మరీను. 

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నాయకత్వాన్ని తిట్టే స్వేచ్ఛగానీ పక్క పార్టీయే దిక్కు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ సైతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. సీల్డ్ కవర్ సంప్రదాయాన్ని అధిష్టానం కొనసాగిస్తే బహిరంగంగా విమర్శించడం నాయకుల సంప్రదాయంగా పాటిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆ పార్టీ ఇచ్చిన టికెట్ పై పోటీ చేసి గెలుపొందారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన తన రాజకీయ వ్యూహంతో అధిష్టానం ముక్కుపిండి తనకు కావాల్సిన సీట్లు సంపాదించుకున్నారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం సెపరేట్. ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా ఉంటూనే మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఉవ్వెత్తున ఎగిసిపడతారు. పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తారు. తీరా ఎవరైనా విమర్శిస్తే పార్టీ బాగుకోసమే తాము అలా మాట్లాడామని అదంతా తమ ఆవేదనగానే పరిగణించాలని చెప్పుకుంటూ ఉంటారు. 

ఇలా కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్న విషయం మరచిపోయి బీజేపీపై ప్రశంసలు గురింపిచారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి దూరం చేశాయి. దీంతో మళ్లీ యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ పై అమాంతంగా ప్రేమ ఒలకబోసారు. అంతలోనే మళ్లీ  కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనంగా ఉన్నది అన్నది వాస్తవం. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయం అయిపోతున్న తరుణంలో కొత్త పీసీసీ చీఫ్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ వేట ప్రారంభించింది. 

ఈసారి ఎట్టిపరిస్థితుల్లో తనకే పీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశించారు. అయితే తమ్ముడు చేసిన వ్యాఖ్యలు అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనకు పీసీసీ చీఫ్ గా అవకాశం దక్కదని డిసైడ్ అయిపోయారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

అయితే జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 వంటి బిల్లుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త చేరువయ్యారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి మద్దతు కూడగట్టుకోలేకపోయినా అటు నుంచి అయినా నరుక్కొద్దామని భావించినట్లు ఉన్నారేమో ఏమో ఏకంగా రాహుల్ గాంధీ జపం చేస్తున్నారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని కూడా క్యాష్ చేసుకున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీయే కొనసాగాలని ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ అంగీకరించని పరిస్థితుల్లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా ఎంపిక చెయ్యాలని సమావేశంలో డిమాండ్ చేశారు. 

ఇలా గాంధీ కుటుంబానికి తాను వీరవిధేయుడుననే ముద్ర వేసుకునేందుకు ఈ అంశాలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కలిసొచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి ఎత్తులకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.