టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు.

అనంతరం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. మంత్రిలా కాకుండా వీధి రౌడీలా వ్యవహరించిన మల్లారెడ్డి వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలన్నారు. పిచ్చి కుక్కలు కరిచినట్టు మొరుగుతున్న మల్లారెడ్డి మంత్రినా... కంత్రినా అంటూ మండిపడ్డారు.

''మల్లారెడ్డి ఖబర్దార్... మీరు తక్షణమే రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణ చెప్పాలి. లేదంటే నిన్ను తెలంగాణలో అడుగడుగునా అడ్డుకొని తగిన గుణపాఠం చెబుతాం'' అని కోమటిరెడ్డి హెచ్చరించారు. 

వీడియో

''రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజ్యాంగంపై ప్రమాణం చేసింది మర్చిపోయావా? రోడ్డుపై తిరిగే రోమియోలా రాష్ట్ర మంత్రి మీడియా సమావేశంలో పిచ్చి కూతలు, బూతు పురాణం మాట్లాడటం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు.

''ప్రజాస్వామ్యాన్ని గౌరవించని మల్లారెడ్డికి మంత్రిగా కొనసాగే హక్కు లేదు. ఒక యూనివర్సిటీ, వివిధ రకాల కళాశాలలకు చైర్మన్ గా వున్న మల్లారెడ్డి విద్యార్థులకు ఇదే నేర్పుతున్నాడా? అక్రమాలకు పాల్పడకుంటే ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి?'' అని కోమటిరెడ్డి నరేందర్ మండిపడ్డారు.