హైదరాబాద్: ప్రముఖ వ్యాపార వేత్త రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ఆరు మాసాలుగా స్కెచ్ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాంప్రసాద్ హత్య కేసులో  సోమవారం రాత్రి  కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.రాంప్రసాద్ హత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ నెల 6వ తేదీన రాత్రి  పంజగుట్ట సమీపంలో వ్యాపారవేత్త రాంప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. కోగంటి సత్యం తన భర్తను హత్య చేశాడని  రాంప్రసాద్ భార్య వైదేహీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.రాంప్రసాద్‌ను తానే హత్య చేసినట్టుగా శ్యామ్ అనే వ్యక్తి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. శ్యామ్ కోగంటి సత్యం అనుచరుడిగా పోలీసులు చెబుతున్నారు.

రాంప్రసాద్ హత్యకు చోటు చేసుకొన్న  కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆరు మాసాలుగా రాంప్రసాద్ హత్యకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నెల రోజుల క్రితమే హైద్రాబాద్‌లో కోగంటి సత్యం మనుషులు  హైద్రాబాద్ లో ఇంటిని అద్దెకు తీసుకొన్నారని పోలీసులు గుర్తించారు.

కోగంటి సత్యానికి చెందిన ఐదు సెల్‌పోన్లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారని సమాచారం.  ఖమ్మం జిల్లాలోని  భక్తాంజనేయస్వామి చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన భూమిని కొనుగోలు చేసేందుకు సత్యం రూ.2 కోట్లను కోర్టులో డిపాజిట్ చేశాడు. 

అయితే ఈ భూమిని విక్రయించకూడదని కోర్టు ఆదేశించింది. దీంతో  డిపాజిట్ చేసిన డబ్బులను చెల్లించాలని కోరింది. అయితే ఈ డబ్బులను తనకే చెల్లించాలని  కూడ కోగంటి సత్యం కోర్టును ఆశ్రయించారు. అయితే అగ్రిమెంట్ ప్రకారంగా ఈ డబ్బులను రాంప్రసాద్ కు చెల్లించాలని  కోర్టు ఆదేశించింది.

అయితే ఈ డబ్బుల కోసమే ఈ హత్య జరిగిందా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో  పోలీసులు ఆరా తీస్తున్నారు. వైజాగ్, హైద్రాబాద్‌కు చెందిన వ్యాపారులతో కలిసి కోగంటి సత్యం ఈ ప్లాన్ చేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.