హైదరాబాద్: తాను ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ అన్న మాట వాస్తవమేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఆస్తులు పెంచుకోవటానికే పనిచేశారన్నారు. కేసీఆర్ ఓడినా గెలిచినా ఫామ్ హౌస్ కే పరిమితమంటూ ఎద్దేవా చేశారు.

ఈనెల 23న మేడ్చల్‌లో జరగబోయే యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సభలో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం వచ్చిందన్నారు. సభకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఒక పార్టీనే అధికారంలోకి రావటం కష్టమని, హామీల అమలు కోసమే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ బాధ్యత తీసుకున్నానని కోదండరాం స్పష్టం చేశారు.
 
కూటమి ఏర్పాటులో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తుడుచుకుని ముందుకు వెళ్లామన్నారు. కాంగ్రెస్‌ సర్వేల పేరుతో తమ అభ్యర్థులను చులకన చేసిందని గుర్తు చేశారు. 

ప్రజాకూటమి వల్ల టీజేఎస్‌కు కూడా మేలు జరుగుతుందని ఆశించామని, తాము 5 చోట్ల తప్పుకున్నా కాంగ్రెస్‌ కనికరం చూపలేదని కోదండరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పోటీ చేయకపోవడం తమ మంచికేనని అన్నారు. కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తానని కోదండరాం స్పష్టం చేశారు.