Asianet News TeluguAsianet News Telugu

నిరహార దీక్షను విరమించిన కిషన్ రెడ్డి.. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరహార దీక్షను విరమించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న  కిషన్ రెడ్డికి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ దీక్ష విరమింపజేశారు.

Kishan Reddy continues Deeksha in Nampally BJP Office ksm
Author
First Published Sep 14, 2023, 10:58 AM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరహార దీక్షను విరమించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న  కిషన్ రెడ్డికి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ దీక్ష విరమింపజేశారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను వంచించారని ఆరోపిస్తూ కిషన్ రెడ్డి బుధవారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద  '24 గంటల నిరాహార దీక్ష' చేపట్టారు. అయితే సాయంత్రం నిరసనకు అనుమతించిన సమయం అయిపోయిందంటూ పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కిషన్ రెడ్డిని అక్కడి నుంచి బలవంతగా తరలిచేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కింద పడ్డారు. అయితే ఎట్టకేలకు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తరలించారు. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే కిషన్‌ రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ చేసి కిషన్‌ రెడ్డిని పరామర్శించారు. కేసీఆర్‌ సర్కార్‌పై పోరాటం సాగించాలని సూచించారు. కిషన్ రెడ్డి దీక్ష చేపట్టి 24 గంటలు పూర్తి కావడంతో బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ దీక్షను విరమింపజేశారు. 

ఇదిలాఉంటే, ఇందిరా పార్క్ వద్ద దీక్షలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌లో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని, నగరంలో తమ పిల్లలకు ఉద్యోగ ఆధారిత కోచింగ్‌ను అందించడానికి తల్లిదండ్రులు తమ విలువైన బంగారు వస్తువులను అమ్ముకుంటున్నారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అవినీతి, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి వల్ల వేలాది మంది యువత భవిష్యత్తు నాశనం అయిందని ఆరోపించారు. కేసీఆర్ వెన్నుపోటు పొడిచడంతో ఇప్పుడు చాలా మంది నిరుద్యోగ యువకులు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios