ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీని తాను వీడే ప్రసక్తే లేదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చిచెప్పారు. భట్టి కోటకు బీటలు వారుతున్నాయన్న భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు ఏమాత్రం వాస్తవం లేదన్నారు.

గురువారం ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్‌ఎస్‌లో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ విపరీతంగా ఉందని ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారని చెప్పుకొచ్చారు. 

ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా పదికి పది స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, సైనికుడిలా పార్టీలో పనిచేస్తుంటే కొంత మంది మాత్రం పనిగట్టుకుని తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరగుతున్న ప్రచారం అంతా అవాస్తవమన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఎవరినైనా తాను కలిసినట్టుగానీ, మాట్లాడినట్లుగానీ నిరూపిస్తారా అంటూ సవాల్ విసిరారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 

ఇకపోతే గత ​కొన్ని రోజులుగా ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతారంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇద్దరు కాదు ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అంటూ చెప్పుకొచ్చారు. 

రేవంత్ చెప్పినట్లుగానే ఇప్పటికే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఇక మిగిలిన ఆ ఇద్దరు ఎవరా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరా ఎంపీలు అన్న కోణంలో ఆరా తీస్తుంది.