తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అన్న తేడా లేకుండా ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నిజం చేస్తూ అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఒక్క ఖమ్మం జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ చతికిలపడింది.

ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఒక స్థానంలో మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. ఫలితాల తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ నేతల వల్లనే ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశాడు. ఆ వెంటనే జిల్లాకు చెందిన కీలక నేతలంతా పార్టీకి రాజీనామా చేయడంతో కారు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ... ఖమ్మం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు పదవికి రాజీనామా చేశారు.

మంత్రి కేటీఆర్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ కేటీఆర్ ఇప్పుడు వద్దని చెప్పడంతో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే అభ్యర్థుల విజయం కోసం విజయ్ బాబు రెండు నెలల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు.

నిన్న కేసీఆర్ వ్యాఖ్యలతో తీవ్రంగా మనస్తాపానికి గురైన ఆయన తాను విధులు సరిగా నిర్వర్తించలేకపోయానని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ డీసీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయ్ బాబు ప్రకటించారు.