హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుండి  ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో  వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఈసీ ప్రకటించడం లాంఛనమే.

తెలంగాణ రాష్ట్రం నుండి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.  తెలంగాణ రాష్ట్రం నుండి  కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి లు టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం నుండి గరికపాటి మోహన్ రావు కేవీపీ రామచంద్రారావుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. గరికపాటి మోహన్ రావు ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 

ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన కె. కేశవరావు ఏపీ రాష్ట్రానికి గతంలో అలాట్ చేశారు. కేశవరావు పదవీ కాలం కూడ ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీకి ముగియనుంది. దీంతో కేశవరావుకు టీఆర్ఎస్  మరోసారి అవకాశం కల్పించింది. 

2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేఆర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో సురేష్ రెడ్డికి రాజ్యసభ టిక్కెట్టును కేటాయించింది టీఆర్ఎస్. 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు 101 సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ సహ ఇతర పార్టీలు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఈసీ ప్రకటించడమే తరువాయి.

నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం  నాటితో గడువు తీరింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో  ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు కేఆర్ సురేష్ రెడ్డి, కేశవరావులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రెండు మూడు రోజుల్లో ఈసీ ప్రకటించనుంది.