హైదరాబాద్: నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోని సూపర్ హిట్ పాట. అలాగే సింహం సింగిల్ గా వస్తుంది ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోని హిట్ డైలాగ్. ఈ సినిమా పాటలేంటి...డైలాగులు ఏంటి అనుకుంటున్నారా...వీటికి తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఓ లింక్ ఉందండోయ్ అందుకే చెప్పా. 

అసలు విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి స్టార్ కాంపైనర్ ఒక్కరే. ఒక్కరే సూపర్ స్టార్ గా రౌండ్లు కొట్టేశారు. ఆయనే గులాబీ బాస్ కేసీఆర్. అటు ప్రతిపక్ష పార్టీ ప్రజాకూటమి తరపున బోలెడు మంది స్టార్లు. సినీ,క్రికెట్,రాజకీయ ఉద్దండులు, జాతీయ స్టార్లు ఇలా ఎంతోమంది స్టార్లు. 

ప్రజాకూటమిలో ఎంతమంది స్టార్లు ఉండి ఏం లాభం కేసీఆర్ పొలిటికల్ హీరోయిజం ముందు దిగదుడిపు కావాల్సిందే. మెుత్తం అంతమంది స్టార్ లు కలిసి కేసీఆర్ ను తెలంగాణ స్టార్ గా చేశారు. అందుకే కేసీఆర్ టీఆర్ఎస్ స్టార్ కాంపైనర్. ఆ స్టార్ కాంపైనర్ ఇప్పుడు తెలంగాణకు అధిపతి కాబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేశారు ఈ గులాబీ దళపతి.
 
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అంతా భావించారు. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారాయి.  టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడ్డ ప్రజాకూటమి వటుడు ఇంతై ఇంతింతై అన్న చందంగా రోజురోజుకు తమ ప్రాభవాన్ని పెంచుకోగలిగారు. వారి వ్యూహాలు ఒక్కోసారి గులాబీ దళపతికి ముచ్చెమటలు పట్టించాయి కూడా. 

ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ రద్దు చెయ్యడం, గంటల వ్యవధిలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం ఆ మరుసటి రోజు నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిపోవడం వంటి టీఆర్ఎస్ వ్యూహం పక్కా ప్రణాళికతో జరిగింది. 100 స్థానాల్లో టీఆర్ఎస్ గెలవబోతుందంటూ సీఎం కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు ఆరోజే ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి సభరోజు కూడా అదే చెప్పారు. ఆఖరికి ఓటు వేసిన పోలింగ్ కేంద్రం దగ్గర కూడా కేసీఆర్ అదే ధీమా వ్యక్తం చేశారు. 

అంతా టీఆర్ఎస్ ప్రభంజనమేనని మెుదటి నుంచి చెప్పుకొచ్చారు కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు. తమకు ఎదురే లేదని మళ్లీ సీఎం పీఠం మాదే అని తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన నాటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అదే ధీమా ఫలితాల్లోనూ కనబడింది. ఇంకా చెప్పాలంటే ఈ ఎన్నిల్లో వచ్చిన ఫలితాలతో రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను సైతం శాసిస్తామంటూ కేసీఆర్ ప్రతీ బహిరంగ సభలోనూ చెపప్పారు. అందుకు తగ్గట్లుగానే ప్రజల నుంచి స్పందన కూడా వచ్చింది. 

అంతేకాదు వాళ్లు సీట్లు పంచుకునే లోపు స్వీట్లు పంచుకుంటామంటూ చిన్న గులాబీ బాస్ కేటీఆర్, కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు పదేపదే వేదికల్లో చెప్పారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు జరిగాయి.   

ప్రజాకూటమిలో సీట్లు పంచుకోవడమే చాలా కష్టమని అయినా అందులో అసంతృప్తులు ఎక్కువగా ఉంటారని అది తమకు లాభిస్తోందని కేసీఆర్ భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. దరిదాపుల్లోకి కూడా రాదనుకున్న ప్రజాకూటమి దాటెల్లిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

ప్రజాకూటమి రోజురోజుకు బలం పుంజుకోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు స్టార్ లు క్యాంపైన్ చేపట్టడం గులాబీ గూటిలో గుబులు మెుదలైంది. అటు కేసీఆర్   భావించినట్లు నవంబర్ వస్తాయనుకున్న ఎన్నికలు డిసెంబర్ లో జరగడం, నవంబర్ 24 లేదా డిసెంబర్ 6న జరిగితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, జ్యోతిష్యం ప్రకారం కేసీఆర్ దే అధికారం అని అయితే ఆ రెండు రోజుల్లో ఎలక్షన్ రాకపోవడంతో ఇవి చెడు సంకేతాలకు కారణమా అంటూ అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 

అంతేకాదు డిసెంబర్ 7 అమావాస్య నాడు ఎన్నికలు అనేసరికి అంతా గందరగోళానికి గురయ్యారు. అయినా కేసీఆర్ పునరాలోచనలో పడలేదు. వెనకడుగు వెయ్యలేదు. సెప్టెంబర్ 6న ఏదైతే చెప్పారో అదే అమలు చేశారు. 

ఇక ముహూర్తం అవన్నీ కాదు ఇక ప్రజలనే నమ్ముకుందాం అంటూ కేసీఆర్ టీం బరిలోకి దిగింది. గులాబీ బాస్ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారీ బహిరంగ సభలను సైతం నిర్వహించారు.  

ఇక కేసీఆర్ తనయుడు కేటీఆర్ సైతం తన ప్రచారాలతో హోరెత్తించారు. తండ్రి ప్రజాఆశీర్వాద సభలతో చుట్టేస్తుంటే కేటీఆర్ ఆయా నియోజకవర్గాల్లో  రోడ్ షోలతో హోరెత్తించారు. అంతేకాదు గ్రేటర్ హైదరబాద్ అభ్యర్థుల గెలుపును సైతం కేటీఆర్ ఒక్కడే మోశాడు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ షో పూర్తైన తర్వాత మళ్లీ కేటీఆర్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.  

అటు మేనల్లుడు హరీష్ రావు గజ్వేల్, సిద్ధిపేట, కొడంగల్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే ఇతర నియోజకవర్గాలపైనా దృష్టిసారించారు. ఇకపోతే కేసీఆర్ తనయ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం రోడ్ షోలు, ప్రచారాలతో హోరెత్తించారు.   

అయితే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినట్లు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కంటే వెనుకంజలో ఉన్న ప్రజాకూటమి వ్యూహంతో ముందుకెళ్లింది. జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. అంతేకాదు స్టార్స్ తో, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వారి రోడ్ షోలతో మార్మోగించింది. 

కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి రోడ్ షోలతో ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఎక్కడికక్కడ అన్నా అంటూనే కేసీఆర్ పై విమర్శలు సంధించారు. తెలంగాణ అంతా స్టార్ కాంపైనర్ హోదాలో చుట్టేశారు. 

అటు సినీనటి కుష్భూ సైతం తన ప్రచారంతో మార్మోగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత లేదంటూ తనదైన స్టైల్ లో ప్రచారం చేశారు. తెలంగాణ కేబినేట్ లో మహిళలకు స్థానం లేదని, బతుకమ్మ చీరలలో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బతుకమ్మ చీరలను కనీసం కవిత కట్టుకుంటుందా అంటూ విమర్శలు కుప్పించారు. 

ఇకపోతే టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్ముద్ అజహరుద్దీన్ సైతం ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ముస్లిం సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. దీంతో కెప్టెన్ తన టీంతో మరింత ముందుకు దూసుకెళ్లారు.  

అలాగే పంజాబ్ మంత్రి మాజీక్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ  సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గులాం నబీ ఆజాద్, కుంతియా వంటి నేతలు సైతం తెలంగాణ ప్రచారంలో ప్రజాకూటమి తరపున హోరెత్తించారు. 

ఇకపోతే యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల టూర్ లతో ఇక ప్రజాకూటమిదే గెలుపంటూ ప్రచారం జరిగింది. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులు తెలంగాణలోనే మకాం వేసి రోడ్ షోలతో మార్మోగిస్తూ కేసీఆర్ ను ఉతికి ఆరేశారు. 

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోటాపోటీగా గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించారు. మాస్ డైలాగులకు పెట్టింది పేరైన బాలయ్య తన పంచ్ డైలాగులతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. చివరికి తనకు ఉన్న పాండిత్యాన్ని రోడ్ షోలో ప్రదర్శించబోయి నవ్వుల పాలయ్యారు.

వీరితోపాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, సీపీఐ జాతీయ నేత నారాయణ సైతం ప్రజాఫ్రంట్ తరపున ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేశారు. మెుత్తానికి ప్రజాఫ్రంట్ తరపున జరుగుతున్న ఎన్నికల ప్రచారం అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టిస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది కూడా. 

అటు బీజేపీ సైతం కేసీఆర్ ను వదల్లేదు. తెలంగాణ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకులను రంగంలోకి దింపింది. బీజేపీ తరపున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీలను ఎన్నికల ప్రచారంలో దించింది. 

వీరితోపాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ చిన్నమ్మగా సుపరిచితురాలైన సుష్మాస్వరాజ్  జేపీ నడ్డా, రాం మాధవ్, చత్తీస్ ఘడ్ సీఎం రమణ్ సింగ్, ఎంపీ జీవీఎల్ నరసింహారావులతోపాటు ఇతర జాతీయ నేతలంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ లో చంద్రబాబు రోడ్ షోలతో హోరెత్తించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సెటిలర్స్ ఓటర్లను ప్రజాఫ్రంట్ వైపు మళ్లే అవకాశం ఉందని వదంతులు సైతం వచ్చాయి. 

గ్రేటర్ హైదరాబాద్ లో రాయలసీమ వాసులు వ్యాపారస్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు టీడీపీ పట్టున్న ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాపైనా చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. 

ఇక ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయానికి అన్ని పార్టీలు ఒక్క టీఆర్ఎస్ పార్టీపైనే ముప్పేట దాడికి దిగాయి. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను విస్తృతంగా ప్రచారం చేశాయి.   

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ వీడబోతున్నారంటూ ప్రచారం ఆపార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. ప్రచారం వచ్చినట్లుగానే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. 

ఇంకొంతమంది పార్టీ వీడతారంటూ టీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బతియ్యాలని చూసినా అవేమీ పట్టించుకోలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ ఓట్లు చంద్రబాబు ఎత్తుకుపోతున్నాడని జోరుగా ప్రచారం చేసినా వెనకడుగు వెయ్యలేదు.  

అటు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సైతం తెలంగాణలో ప్రజల నాడీ ప్రజాకూటమివైపే ఉందంటూ చేసిన కామెంట్లు గెలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించిడం టీఆర్ఎస్ శిబిరంలో కాస్త కలకలం రేపాయి. 

అటు ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి మిత్ర పక్షంగా ఉంటున్నట్లు ప్రకటించిన ఎంఐఎం సైతం వివాదాస్పద వ్యాఖ్యాలు చేసింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తామే కింగ్ లం కాబోతున్నామని కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ముఖ్యమంత్రో నిర్ణయించేది తామేనంటూ కీలక ప్రకటనలు చేశారు కూడా.

 అంతేకాదు కర్ణాటక రాష్ట్రాన్ని చూపిస్తూ38 సీట్లు గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కాగా లేని 8 సీట్లు గెలిచి ఎంఐఎం ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకోలేమా అంటూ బహిరంగ ప్రచారాల్లో కామెంట్లు చేశారు. వాటన్నింటిని గులాబీ బాస్ కేసీఆర్ కానీ, తనయకుడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. 

ఇంతమంది స్టార్లు ప్రచారం చేసినా, పార్టీకి ఇబ్బందులు వచ్చినా ఎదురొడ్డి నిలబడ్డారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించానని ఎలా అయితే చెప్పారో అలానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అలానే గెలిచి అధికారాన్ని సాధించానని ధీమా వ్యక్తం చేశారు దాన్ని నిజం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల దళపతి అయిన ఈ గులాబీ బాస్ ఆ స్టార్లను మించిన సూపర్ స్టార్ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.